chitika

Flag Counter

chitika

Search This Blog

Wednesday, 4 May 2016

SUGAR PROBLEM 2 EYES - HOW DIABETES EFFECTED EYES - EYE CARE TIPS IN TELUGU


 చూపుకు చక్కెర చేటు!
• చక్కెర కా’ద’ది..... కంటికి కారం!
మధుమేహం.. ఓ సమస్యల సుడిగుండం. ఇంకా చెప్పాలంటే.. పైకేమీ కనబడకుండా చాప కింద నీరులా విస్తరిస్తూ ఒళ్లంతా కబళించే ఉపద్రవం! మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే అది గుండె నుంచి కిడ్నీల వరకూ.. కాళ్ల నుంచి కళ్ల వరకూ.. శరీరమంతా దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. మధుమేహులకు గుండె పోటు, పక్షవాతం, కిడ్నీలు దెబ్బతినటం, కాళ్ల మీద పుళ్లు పడి మానకపోవటం వంటి ముప్పులు చాలా ఎక్కువన్న విషయం ఇప్పుడు అందరికీ బాగానే తెలుసు. కానీ మధుమేహులకు వచ్చే చూపు సమస్యల గురించి మాత్రం నేటికీ సరైన అవగాహన ఉండటం లేదు. నిజానికి మధుమేహ కంటి సమస్య... మనం ఏమాత్రం విస్మరించటానికి వీల్లేని పెద్ద సమస్య! దీని మూలంగా నేడు మన సమాజంలో ఎంతోమంది నడివయసులోనే చూపు పోగొట్టుకుని.. అంధత్వంలోకి వెళ్లిపోయి.. అర్ధాంతరంగా ఉపాధి కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలను కుంగదీసేస్తున్న సమస్య ఇది!
మధుమేహాన్ని సరిగా నియంత్రణలో పెట్టుకోకపోతే.. దాని దుష్ప్రభావం కంటిలోని కీలకమైన రెటీనా’ పొర మీద కూడా పడుతుంది. ఒకసారి ఈ పొర దెబ్బతినటం మొదలైందంటే.. అది మరింత దెబ్బతినకుండా చూడటం తప్పించి.. సమస్యను పూర్తిగా నయం చెయ్యటం సాధ్యం కాదు. కాబట్టి అసలీ సమస్య తలెత్తకుండా చూసుకోవటం అత్యుత్తమం. ఒకవేళ సమస్య మొదలవుతుంటే దాన్ని సత్వరమే పట్టుకుని వెంటనే అడ్డుకోవటం అత్యవసరం.
మధుమేహం.. మారుతున్న జీవనశైలి కారణంగా పట్టణాలనే కాదు, ఇప్పుడు గ్రామాలను కూడా చుట్టబెట్టేస్తున్న పెద్ద సమస్య! నిజానికి మధుమేహం వచ్చినా, అది అదుపు తప్పినా కూడా మనకు పైకి పెద్దగా లక్షణాలేమీ ఉండకపోవచ్చుగానీ అది క్రమేపీ లోలోపల కీలక అవయవాలన్నింటినీ దెబ్బతీస్తుంటుంది. దీనికి మన కన్ను’ కూడా మినహాయింపేం కాదు. మధుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినటం, ముఖ్యంగా రెటీనోపతి’ అన్నది చాలా తీవ్రమైన సమస్య. కంటి లోపల రెటీనా పొర దెబ్బతింటున్నా కూడా తొలిదశలో పెద్దగా లక్షణాలేం ఉండకపోవచ్చు. కానీ లోలోపల సమస్య ముదురుతూ, చూపు మొత్తం దెబ్బతిని, అంధత్వంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు మధుమేహానికీ, కంటిలోని రెటీనా పొరకూ లంకె ఏమిటి? వివరంగా చూద్దాం...!
• లంకె ఎక్కడుంది?
* రెటీనా: మన కనుగుడ్డులో వెనకాల వైపున ఉండే సున్నితమైన పొర ఇది. ఒక రకంగా ఇది మన కంట్లో ఉండే సినిమా తెరలాంటిది. కంటి ముందున్న వస్తువుల ప్రతిబింబం దీని మీద పడి, సంకేతాల రూపంలోకి మారితే.. ఆ సంకేతాలు మెదడును చేరి.. అప్పుడు మనకు ఎదురుగా ఉన్నదేదో కనబడుతుంది’. కాబట్టి చూపు మొత్తానికి ఈ రెటీనా పొర అత్యంత కీలకం.
* మధుమేహం: రక్తంలో గ్లూకోజు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుండటమే మధుమేహం. ఈ మధుమేహం- రెటీనా’ పొరను రకరకాలుగా పాడుచేస్తుంది. దాని పనితీరును చెడగొడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావాలంటే మన శరీరంలో జరుగుతుండే సహజ ప్రక్రియలను, మధుమేహం వల్ల వచ్చే మార్పులను కొద్దిగా అర్థం చేసుకోవటం అవసరం.

మన శరీరంలో ప్రతి కణానికీ, ప్రతి అవయవానికీ శక్తి అవసరం. ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం తిన్న ఆహారం గ్లూకోజుగా మారి, అది రక్తంలో కలుస్తుంది. రక్తం.. ఆ గ్లూకోజును శరీరంలోని అణవణువుకూ తీసుకువెళుతుంది. కాబట్టి రక్తాన్ని సరఫరా చేసేందుకు మన శరీరమంతా కూడా చిన్నాపెద్దా రక్తనాళాలు బోలెడన్ని ఉంటాయి. శరీరంలోని చిట్టచివ్వరి, సున్నిత భాగాలక్కూడా రక్తసరఫరా చేసేందుకు చాలా సన్నటి, సూక్ష్మ రక్త కేశ నాళాలుంటాయి. మధుమేహ బాధితుల్లో- రక్తంలో గ్లూకోజు ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి.. గ్లూకోజు అధికంగా ఉన్న రక్తం ఈ రక్తనాళాలు, కేశనాళాల గుండా నిరంతరం ప్రవహిస్తున్నప్పుడు క్రమేపీ ఈ నాళాలు దెబ్బతింటాయి. కంటిలోని రెటీనా’ పొర నిండా కూడా రక్తకేశనాళికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. మధుమేహుల్లో ఈ కేశనాళాలు దెబ్బతిని, రెటీనా పొర మీద కొన్ని రకాల సమస్యలు బయల్దేరతాయి. క్రమేపీ ఇవే చూపు దెబ్బతినటానికి దారి తీస్తాయి.
* రెండోది- మన రక్తంలోని ఎర్ర కణాల్లో హిమోగ్లోబిన్‌ ఉంటుంది. శరీర భాగాలన్నింటికీ ఇది ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంటుంది. రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజు స్థాయిలు ఎక్కువైపోతాయో.. అప్పుడా గ్లూకోజు ఎర్ర కణాల్లో కూడా చేరిపోతుంది (గ్లైకేషన్‌). ఫలితంగా ఎర్ర కణాలు సరిగా పనిచెయ్యలేవు. దీంతో శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది, వాటి పని మందగిస్తుంది. రెటీనా పొరకు కూడా ఇలాగే ఆక్సిజన్‌ అందక, దాని పనితీరు దెబ్బతింటుంది.
• లక్షణాలు
తొలిదశలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. చూపు బానే ఉంటుంది. క్రమేపీ ముదురుతున్న దశలో- అక్షరాలు వంకరగా అగుపించటం, పక్క పదం కనబడకపోవటం వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఇలాంటి సూక్ష్మమైన మార్పులను గుర్తించటం కీలకం. నిజానికి లక్షణాలు కొద్దిగా కనబడటం ఆరంభమయ్యే సరికే లోపల సమస్య తీవ్రమై ఉంటుందని, చూపు దెబ్బతినటాకి దారితీస్తోందని గుర్తించాలి. ఈ సమయంలో జాగ్రత్త పడితే సమస్య ఇంకా ముదిరి చూపు పూర్తిగా పోయే స్థితి రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి చూపులో ఎలాంటి తేడా కనబడినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, తప్పకుండా రెటీనా పరీక్ష చేయించుకోవాలి.
• ఇలా ఎప్పుడు జరుగుతుంది?
కంటి సమస్యలు మధుమేహులు ఎవరికైనా రావచ్చుగానీ... దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారికి, ముఖ్యంగా మధుమేహం నియంత్రణలో లేని వారికి ఈ సమస్యల ముప్పు చాలా ఎక్కువ. మధుమేహం వచ్చిన పదేళ్ల తర్వాత దుష్ప్రభావాలు మొదలవ్వచ్చు. అయితే మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే 10 ఏళ్ల తర్వాత రావాల్సిన మార్పులు ఐదేళ్లకే రావచ్చు. అవి పదేళ్లకల్లా చూపును దెబ్బతీసే స్థాయికి చేరుకోవచ్చు. ఉదాహరణకు 40 ఏళ్ల వయసులో మధుమేహం వచ్చి, పదేళ్ల పాటు నియంత్రణలో లేకపోతే 50 ఏళ్లకల్లా చదవటానికి అవసరమైన సున్నితమైన చూపు దెబ్బతినొచ్చు. ఆ తర్వాత పనులు చేసుకోవటానికి అవసరమైన చూపూ పోవచ్చు. దీంతో కుటుంబం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. ఇలా ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నారు. అందుకే దీన్ని ఏమాత్రం విస్మరించటానికి లేదు.
• పరీక్షలు
నేరుగా రెటీనా పొరను చూడటం చాలా ముఖ్యం. దీన్ని ఫండస్‌ ఎగ్జామినేషన్‌’ అంటారు. ఇందుకు ఫండోస్కోపీ, అలాగే డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్‌ ఫండస్‌ కెమేరాలు బాగా ఉపయోగపడతాయి. స్లిట్‌ల్యాంప్‌లో కూడా కటకాల సాయంతో కంటిపాపను పెద్దదిగా చేసి పరీక్షిస్తే రెటీనా మధ్యభాగంలో (మాక్యులాలో) ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఈ పరీక్షలను తరచుగా చేస్తుంటే రెటీనా సమస్యలను ముందుగానే పసిగట్టే వీలుంది.
* ఫ్లోరొసిన్‌ యాంజియోగ్రఫీ: రెటీనా పొర మీద మధుమేహం కారణంగా మార్పులు మొదలై.. రక్తనాళాలు అక్కడక్కడ ఉబ్బుతున్నాయని గుర్తించిన వారికి తప్పనిసరిగా చెయ్యాల్సిన పరీక్ష ఇది. దీన్ని రెటీనల్‌ యాంజియోగ్రామ్‌’ అంటారు. ఇందులో ముందుగా ముంజేతి రక్తనాళంలోకి ఒక రకం రంగు పదార్థాన్ని (సోడియం ఫ్లోరొసిన్‌) ఎక్కిస్తారు. ఇది 15-20 సెకండ్లలోపే కంటిలోని రెటీనాను చేరుకుంటుంది. ఈ సమయంలో చకచకా రెటీనాను ఫొటోలు తీస్తారు. దీనిలో కేశరక్తనాళాలు ఎలా ఉన్నాయి? అవి ఎక్కడెక్కడ ఉబ్బాయి? వాటిల్లోంచి రక్తం లేదా ద్రవం లీకవుతోందా? రక్తనాళాలు ఎక్కడన్నా మూసుకుపోయాయా? వాటిస్థానంలో కొత్తవి పుట్టుకొస్తున్నాయా? తదితర సమాచారం అంతా తెలుస్తుంది. రెటినోపతి ఏ దశలో ఉందన్నది ఇందులో బయటపడుతుంది.
* ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ (ఓసీటీ): ఇందులో ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలను రెటీనా మీద పడేలా చేస్తారు. ఇవి పరావర్తనం చెంది.. స్కానింగు చిత్రం వస్తుంది. ఇందులో రెటీనా పొరల్లో, ముఖ్యంగా రెటీనా మధ్య భాగం మాక్యులాలో- వాపు ఏమైనా ఉందా? అక్కడ నీరు చేరిందా? అన్నది తెలుస్తుంది.

ఈ పరీక్షల ఆధారంగా రెటీనోపతి సమస్య ఏ దశలో ఉందన్నది తెలుస్తుంది. దశను బట్టి చికిత్స చెయ్యాల్సి ఉంటుంది.
• ముంచుకొచ్చే ముప్పులో తొలి దశ.. మలి దశ!
మధుమేహం కారణంగా వచ్చే రెటినోపతీ సమస్యను రెండు దశల్లో చూడొచ్చు.
* తొలిదశలో- రెటీనా పొర మీద ఉండే కేశ నాళికల గోడలు దెబ్బతిని, అవి ఉబ్బుతుంటాయి. ఆ ఉబ్బిన చోట నుంచి రక్తంలోని కొవ్వులు, ద్రవాలు రెటీనా పొర మీదికి లీక్‌ అవుతుంటాయి. దీన్ని నాన్‌ ప్రోలిఫరేటివ్‌’ దశ అంటారు. ఈ దశలో చూపు క్రమక్రమంగా తగ్గుతుంటుందిగానీ మొత్తం పోదు.
* మలిదశలో- రక్తనాళాలు మొత్తం మూసుకుపోతాయి. దీంతో వాటి లోటును భర్తీ చేసేందుకు కొత్త రక్తనాళాలు పుట్టుకురావటం, వాటి నుంచి రెటీనా పొర మీద రక్తస్రావం కావటం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. ఇది తీవ్రమైన దశ. దీన్ని ప్రోలిఫరేటివ్‌’ దశ అంటారు. ఈ దశలో హఠాత్తుగా చూపు మొత్తం పోతుంది.
• మార్పులు పలు రకాలు
మధుమేహం కారణంగా రెటీనా పొర దెబ్బతినిపోవటమన్నది పలు రకాలుగా జరగొచ్చు.
ఇవేమిటో చూద్దాం...!
* గోడల ఉబ్బటం: రెటీనా మీది కేశరక్తనాళాల గోడలు దెబ్బతిని, అక్కడక్కడ పల్చబడతాయి. దీంతో ఆ భాగంలో గోడలు బయటకు తోసుకొచ్చినట్టు.. ఉబ్బినట్టు కనబడుతుంటాయి. వీటినే మైక్రో అనూరిజమ్స్‌’ అంటారు. మధుమేహ రెటీనోపతీ సమస్యలో కనబడే తొలి లక్షణం ఇదే. ఈ స్థితిలోనే మేలుకోవటం ఉత్తమం.
* కొవ్వులు, ద్రవాలు లీకవ్వటం: రక్తనాళాలు పల్చబడి, ఉబ్బిన చోటు నుంచి రక్తంలోని కొవ్వులు, ద్రవాలు లీకయ్యి.. రెటీనా పొరలోకి చేరుకుంటాయి. ఇవి రెటీనా పొర మధ్యభాగం ‘మాక్యులా’ మీద పేరుకుంటాయి. (మ్యాక్యులోపతీ). దీంతో అక్కడ ఒత్తిడి పెరిగి, వాచి.. ఆ భాగం సరిగా పనిచేయదు. ఇలాంటివారికి చుట్టుపక్కల దృశ్యాలన్నీ బాగానే కనిపిస్తుంటాయి గానీ మధ్యలో మబ్బుగా ఉంటుంది. చిన్నచిన్న వస్తువులూ కనబడవు. అద్దాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. వీరికి తక్షణం రెటీనా మీది వాపును తగ్గించటమే మార్గం. వాపును తగ్గించినా కూడా చూపు కొంత మెరుగవుతుందేగానీ మునుపటి స్థాయిలో ఉండదు. అందువల్ల అసలీ స్థితికి రాకుండా చూసుకోవటం ఉత్తమం.
* నాళాలు మూసుకుపోవటం: రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల కేశ నాళికలు మూసుకుపోవచ్చు. దీంతో రెటీనా పొర మీద కొన్నికొన్ని భాగాలకు రక్తసరఫరా ఆగిపోయి, దెబ్బతింటుంది. ఇలా రెటీనా మధ్యభాగానికి (మాక్యులాకు) రక్తసరఫరా నిలిచిపోతే- చూపు పోతుంది. చదవటం, రాయటం వంటివన్నీ కష్టమైపోతాయి. రెటీనా మీద మధ్యభాగం బాగానే ఉండి చుట్టుపక్కల దెబ్బతింటే- ఎదురుగా ఉన్న దృశ్యాలు బాగానే కనబడుతున్నా చూట్టూతా అంతా మసకగా కనబడతుంది. దీనివల్ల అటూఇటూ తిరగటం వంటివన్నీ కష్టమవుతాయి.
* కొత్త నాళాలు పుట్టటం: కేశనాళాలు మూసుకుపోయినప్పుడు రెటీనాకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. దీంతో శరీరం ఆ లోటును భర్తీ చేసుకునేందుకు కొత్త రక్తనాళాలను తయారుచేసుకునే పని ఆరంభిస్తుంది. దీనికోసం వ్యాస్కుల్యార్‌ ఎండోథిలియల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌’ అనేవి విడుదల అవుతాయి. ఇవి పాతనాళాల పక్క నుంచి కొత్త నాళాలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. అయితే ఇలా కొత్తగా పుట్టే నాళాలు పాత వాటికన్నా పల్చగా, బలహీనంగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా చిట్లి, వీటి నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువ. ఈ రక్తం రెటీనా ముందు భాగంలో ఉండే ద్రవంలో గూడు కట్టుకుంటుంది (విట్రియజ్‌ హెమరేజ్‌). దీంతో హఠాత్తుగా చూపు పోయే ప్రమాదముంది.
* రెటీనా వూడిపోవటం: మధుమేహులకు వచ్చే రెటినోపతీ’లో చివరిదశ ఇది. రెటీనా పొర ముందున్న ద్రవంలోకి రక్తస్రావం అయిపోయి.. అది గూడుకట్టినప్పుడు.. క్రమేపీ అది పొరలు పొరలుగా ఏర్పడుతుంది. అవి కరిగే క్రమంలో రెటీనా పొర ముందుకు ముందుకు గుంజినట్లవుతుంది. దీంతో రెటీనా పొర వడివడిపోయి, ­డినట్లవుతుంది. ఇది చాలా తీవ్రమైన దశ.
• చికిత్స
రెటీనా మీద వాపు, రక్తనాళాల నుంచి లీకేజీ వంటి మార్పులేం లేకపోతే.. కేవలం మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రించుకుంటే చాలు. వీరికి ప్రత్యేకించి కంటి చికిత్సలేం అవసరముండదు. కానీ కేశనాళాలు ఉబ్బి, వాటి నుంచి రెటీనా మీదికి లీకేజీలు, వాపు ఉంటే.. ప్రత్యేక చికిత్సలు తప్పవు.
* లేజర్‌ చికిత్స: రక్తకేశనాళాలు అక్కడక్కడ ఉబ్బి, వాటి నుంచి ద్రవాలు రెటీనా పొర మీదకు లీకవుతూ, వాపు వస్తుంటే- ఈ స్థితిలో చూపు బాగానే అనిపించొచ్చు. అయినా దాన్ని వదిలెయ్యకూడదు. లేజర్‌తో వాటిని మాడ్చేసి, ఆ లీకేజీలను మూసెయ్యటం అవసరం. దీన్నే మ్యాక్యులర్‌ ఫొటోకొయాగ్యులేషన్‌’ అంటారు. ఇలా రెటీనా మధ్యభాగంలో ఉబ్బిన కేశ నాళికలన్నింటినీ లేజర్‌ చికిత్సతో మూసేస్తారు. ఈ చికిత్స చెయ్యకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.
* మొత్తానికి లేజర్‌: రెటీనా పొర మీది రక్తకేశనాళాలు ఎక్కడన్నా మూసుకుపోతున్నట్టు గుర్తిస్తే- ఈ స్థితిలో కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా చూడటం, వాటిని అడ్డుకోవటం చాలా అవసరం. అంటే రెటీనా పొరకు ఆక్సిజన్‌ అవసరాన్ని బాగా తగ్గించాలి. లేకపోతే అది కొత్త రక్తనాళాలను పుట్టించే పని మొదలుపెట్టేస్తుంది. అందుకని.. రెటీనా పొర మీద ఎక్కడ రక్తసరఫరా బాగా తగ్గిందో గుర్తించి.. ఆ భాగాన్ని లేజర్‌తో కొద్దిగా మాడ్చేస్తారు. దీంతో అక్కడ ఆక్సిజన్‌ అవసరం తగ్గుతుంది, కొత్త రక్తనాళాలు పుట్టుకొచ్చి, కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. దీన్నే ప్యాన్‌ రెటీనల్‌ కొయాగ్యులేషన్‌’ చికిత్స అంటారు. దీంతో పోయిన చూపు రాకున్నా.. మున్ముందు చూపు మరింత తగ్గకుండా చూసుకోవచ్చు. ఈ చికిత్స తీసుకున్నవాళ్లు చీకట్లో కాస్త ఇబ్బంది పడతారు. చుట్టూ చూపు కూడా కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి సొంతగా వాహనాలు నడపకుండా డ్రైవర్‌ను పెట్టుకోవటం, బస్సుల్లో ప్రయాణించటం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
* యాంటీ-వీఈజీఎఫ్‌ ఇంజెక్షన్లు: రెటీనా పొర మీద అక్కడక్కడ రక్తసరఫరా తగ్గినప్పుడు, కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా ఆపటానికి కొత్తగా యాంటీ-వేజఫ్‌ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇస్తే కొత్త రక్తనాళాలు పుట్టవు. వాపు కూడా కొంత తగ్గుతుంది. ఆ తర్వాత అవసరాన్నిబట్టి లేజర్‌ చికిత్స చెయ్యాల్సి ఉంటుంది.
* విట్రెక్టమీ: రెటీనా పొర నుంచి రక్తస్రావమై, అది కనుగుడ్డులోని ద్రవంలో గూడు కడితే- శస్త్రచికిత్స చేసి ఆ ద్రవాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో రెటీనా పొర ­డి రాకుండా ఉండేందుకు అవసరాన్ని బట్టి సిలికాన్‌ ఆయిల్‌, లేదా గ్యాస్‌ నింపుతారు. అవి రెటీనాను నొక్కి పట్టి ఉంచుతాయి. క్రమంగా అక్కడ ద్రవం భర్తీ అవుతుంది, అప్పుడు ఆయిల్‌ను తీసేస్తారు. ఈ శస్త్రచికిత్స సమయంలో కూడా- రెటీనా పొరకు లేజర్‌ ఇవ్వచ్చు. దాంతో మళ్లీ రక్తస్రావమయ్యే ముప్పు తగ్గుతుంది.

కంటిలో పరిస్థితిని బట్టి ఇలా రకరకాల చికిత్సలు చెయ్యాల్సి ఉంటుంది. లేజర్‌తో పూర్తిగా తగ్గినట్టు కాదు!
చాలామంది కంటికి లేజర్‌ చికిత్స చేయించుకున్నాం.. చూపు మళ్లీ బ్రహ్మాండంగా వచ్చేస్తుందని భావిస్తుంటారుగానీ అది ఏమాత్రం నిజం కాదు. రెటీనోపతీకి చేసే చికిత్సలన్నీ కూడా సమస్య మరింతగా ముదరకుండా చూసేవేగానీ తగ్గిన చూపును పూర్తిగా తెచ్చిపెట్టేవి కాదు.పైగా ఈ చికిత్సలతో సమస్య పూర్తిగా తొలగిపోయినట్లూ కాదు. మధుమేహం కారణంగా మరోచోట.. అంటే చికిత్స చేసిన చోట కాకుండా వేరే చోట సమస్యలు బయల్దేరుతుండొచ్చు. ఈసారి వచ్చే సమస్య ఇంకాస్త ఉద్ధృతంగానూ ఉండొచ్చు. కాబట్టి చికిత్సతో అంతా అయిపోయిందనుకోకుండా.. మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి. వైద్యులు చెప్పినట్లుగా తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ.. లోపల పరిస్థితి ఎలా ఉందో చూసుకుంటుండాలి. జీవితాంతం కంటి మీద ఈ శ్రద్ధ తప్పదు. లేదంటే చూపుకు ఎప్పుడైనా ఎసరు ముంచుకురావచ్చు.

No comments:

Post a Comment

My Blog List

chitika