గీతాసారం.. ముక్తికి సోపానం
కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు లీలామయ - అను వాక్యాల ద్వారా శ్రీమన్నారాయణుని అవతారాలలో శ్రీకృష్ణావతారమే హరిపూర్ణావతారమని స్పష్టమవుతున్నది. అంతేకాక భగవద్గీత విభూతియోగంలో ‘‘మాసానాం మార్గశీర్షాహం’’ అని మార్గశీర్ష మాసం ప్రాముఖ్యతను గురించి చెప్పారు. ఆ కాలంలో ఈ మాసమే సంవత్సరంలో తొలి మాసం. ఈ మాసంలోనే శుద్ధ ఏకాదశినాడు అర్జునునికి శ్రీకృష్ణుడు భగవద్గీతోపదేశం చేసాడు. నాటినుంచి అవతార పురుషులు, ప్రసిద్ధుల జయంతుల వలెనే గీతాజయంతి కూడా జరుపుతూ గీతాదేవిని అర్చించే ఆచారము వ్యాప్తిలోనికి వచ్చినది.
శ్రీ శంకర భగవత్పాదులు గీతాభాష్యం వ్రాస్తూ వేదాలన్నిటి యొక్క సారమే గీతా శాస్త్రం అన్నారు. సహస్రాధికమైన ఉపనిషత్తుల సారాన్ని 700 శ్లోకాలలో, 18 అధ్యాయాలుగా వింగడించి శ్రీ వ్యాస భగవానుడు మహాభారతం భీష్మపర్వంలో నిబంధించాడు. శ్రీమద్భగవద్గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా విన్నది ముగ్గురే. వారు అర్జునుడు, సంజయుడు, పార్థుని రథం జెండాపై ఉన్న కపిరాజు హనుమంతుడు. సంజయుని ద్వారా మనకు అందింది. ‘‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే’’ అంటూ భగవద్గీత ప్రారంభమైనా, వాస్తవానికి యుద్ధం ప్రారంభమైన పది దినముల తరువాత, భీష్ముడు రణరంగంలో కూలిపోయాక, ఆ విషయం సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పగా హతాశుడైన ఆతడు ఎంతగానో శోకించి యుద్ధము ఆరంభమైనప్పటినుంచి జరిగిన వృత్తాంతమును తెలుపవల్సిందిగా సంజయుని అడిగాడు. అప్పుడు సంజయుడు మనం పఠిస్తున్న భగవద్గీతలో అర్జున విషాదయోగం, రెండవ అధ్యాయంలో 10 శ్లోకాలలో పూర్వచరిత్ర చెబుతాడు. రెండవ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 18వ అధ్యాయంలో 66వ శ్లోకంవరకు భగవద్గీతోపదేశం. భగవద్గీతలోని పదునెనిమిది అధ్యాయాలు ఒక్కొక్క యోగం గురించి వివరిస్తాయి.
మరల వీటిని ఆరేసి అధ్యాయాలను గుత్తుగా కట్టి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలుగా వింగడించారు. ఇవిదేనికవి వేరు కాదు. పరస్పర అనుసంధానముంది. అవినాభావ సంబంధముంది. ఈ త్రిషట్కాలలో పరిమాణము ననుసరించి, ఆయా యోగములకు ప్రాధాన్యత నివ్వడం జరిగింది. ఉదాహరణకు కర్మయోగము అధికముగనున్న షట్కమును కర్మయోగమన్నారు. అలానే భక్తి, జ్ఞానయోగములు అధిక పరిమాణము గల దానిలో మిగతా రెండు స్వల్ప పరిమాణము గలిగి ఉంటాయి. ఈ యోగాలన్ని జీవాత్మను పరమాత్మను చేర్చే మార్గాలు. నదులన్నీ ఎలా ప్రవహించినా, చివరకు సంగమించే స్థలం సముద్రమే అన్నట్లు, ఏ మార్గాన్ని జీవుడు ఎంచుకున్నా చివరకు చేరేది ముక్త్ధిమానే్న. ఇదే విషయాన్ని భగవద్గీత మనకు ప్రబోధిస్తున్నది. విశేషమేమంటే యోగాలన్నిటి మధ్య చక్కని పొందిక ఉన్నది. ఒక మాలలో దారం దాగి ఉన్నట్లు, ఏ ఒక్క యోగాన్ని ప్రత్యక్షంగా అనుసరించినా, మిగిలిన యోగాలను పరోక్షంగా అవలంబించినట్లేనని గీత స్పష్టపరుస్తున్నది.
No comments:
Post a Comment