chitika

Flag Counter

chitika

Search This Blog

Thursday 7 August 2014

ARTICLE IN TELUGU ON PALAKURTHI SOMESWARA TEMPLE - WORLD FAMOUS LORD SIVA TEMPLE - MUST VISIT


పావనమైన పాలకుర్తి సోమేశ్వరాలయం 
.
పూర్వం భారతదేశంలో అనేక ప్రదేశాలు పచ్చని వృక్షాలు, నదీనదాలు, కొండలూ వగైరా ప్రకృతి సంపదతో కళకళలాడేవి. అప్పుడు మనుషుల జీవితాలుకూడా ప్రశాంతంగా గడిచేవి. అనేకమంది ఋషులు పర్వతాల్లో, అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో కాలం గడిపేవారు. అలాంటివారిలో కొందరికి భగవంతుడు సాక్షాత్కరించి, వారి కోరిక మీద అక్కడే వెలిసిన సంఘటనలు కూడా అనేకం. అలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో అనేక విధాల అభివృధ్ధిచెంది, అనేక రాజుల పోషణలో అత్యున్నత స్ధితి చూసి, కాలాంతరంలో ఆదరణ తగ్గి, ఈ కాలంలో మరుగునపడిపోతున్నాయి. అలాంటి అపురూప ఆలయాలు దర్శించటంవల్ల చరిత్రలో అనేక విశేషాలు తెలుసుకోగలుగుతాము. వాటిలో ఒకటి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి.

హైదరాబాద్ - వరంగల్ రహదారిలో -- స్టేషన్ ఘనాపూర్ రైల్వే స్టేషన్ ముందునుంచి సరాసరి వెళ్తే 14 కి.మీ.లు వెళ్ళాక పాలకుర్తి వస్తుంది. ప్రశాంత వాతావరణంలో కొండల మధ్య వున్నది ఈ సోమేశ్వరాలయం. ఇక్కడ శివ కేశవులకు బేధం లేదని నిరూపిస్తూ పక్క పక్క గుహల్లో ఒక గుహలో సోమేశ్వరుడు, ఇంకొక గుహలో లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు.

1200, 1300 సంవత్సరాల క్రితం ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారనీ, వారికి ప్రత్యక్షమయిన సోమేశ్వరుడు వారి కోరికపై భక్తజనులనాదరించటానికి స్వయంభూగా ఇక్కడ వెలిశాడనీ చెబుతారు. సప్త ఋషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని ఇంకొక కధనం. ఈ గుహాలయంలో అమ్మవారినికూడా దర్శించవచ్చు.

ఈ స్వామి కరుణకి ఇంకో నిదర్శనం..పూర్వం ఒక వృధ్ధురాలు ప్రతి నిత్యం స్వామికి ప్రదక్షిణ చెయ్యటానికి కొండపైన ప్రదక్షిణ మార్గంలేక కొండ చుట్టూ తిరిగి వచ్చేది. వయసు మీద పడుతున్నకొలదీ ఆవిడ గిరి చుట్టూ తిరగలేక ప్రయాస పడుతుంటే పరమేశ్వరుడు తన ఆలయం వెనుక కొండ చీల్చి ప్రదక్షిణ మార్గమేర్పరిచి ఆ వృధ్ధురాలి ప్రయాస తప్పించాడు. అప్పటినుంచీ స్వామి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తారు. ఈ సొరంగ మార్గం సన్నగా వుండి, కొండ చీలి ఏర్పడినట్లే వుంటుందిగానీ, ఎక్కడా కొండ పగలగొట్టి ఏర్పరచిన మార్గంలా వుండదు.. భక్తులు శుచిగా, భక్తిగా ఆ మార్గంలో వెళ్తే ఎంత లావయినవాళ్ళయినా సునాయాసంగా వెళ్తారనీ, అపరిశుభ్రంగా వెళ్ళేవారిని తేనెటీగలు కుట్టి, కుట్టి తరుముతాయనీ అక్కడివారి నమ్మకం. అక్కడ తేనెపట్లు చాలా వున్నాయి. ఆ తేనెటీగలు ఆ ప్రాంతానికి రక్షక భటుల్లాంటివన్నమాట.

కొండపైన వున్న ఈ ఆలయానికి మహత్యం చాలా ఎక్కువ అని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సుఖ సంతోషాలు, సిరిసంపదలేకాక అపార జ్ఞాన సంపద లభిస్తుందని ప్రఖ్యాతి. ఇక్కడ గుహాలయంలోకి స్వామి దర్శనానికి కూడా ఇదివరకు కూర్చునీ, వంగునీ వెళ్ళవలసి వచ్చేదిట. అయితే 2003 లో భక్తుల సౌకర్యార్ధం ఈ మార్గం సుగమం చేశారు. ఏ ఇబ్బందీ లేకుండా మామూలుగా నడచివెళ్ళి స్వామిని దర్శించవచ్చు. సోమేశ్వరస్వామిని దర్శించి, పూజలు చేసి, పక్కనే ఇంకొక గుహలో వున్న (బయటకు వస్తున్న మార్గంలోనే కనబడుతుంది) శ్రీ లక్ష్మీ నరసింహస్వామినికూడా సేవించవచ్చు. ఇదివరకు కొండపైకి వెళ్ళటానికి 365 మెట్లు ఎక్కి వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు కొండపైకి రోడ్డు కూడా వేశారు. ఆలయందాకా కార్లు వెళ్తాయి.

సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరిగాయ ముడుపు కట్టి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారనీ, తరువాత తమ మొక్కు తీర్చకోవటానికి స్వామి దర్శనం చేసుకుని, తొట్టెలు కడతారనీ చెబుతారు. కొండ దిగువ గో సంరక్షణశాల వున్నది. ఆసక్తి వున్నవారు ఇక్కడ గో పూజ చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు, కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపారాధన జరుగుతాయి.

No comments:

Post a Comment

My Blog List

chitika